భారత జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ ఢిల్లీలో నిర్వహించిన ఆఫ్ఘనిస్తాన్ పై ప్రాంతీయ భద్రతా గోష్ఠిలో పాల్గొన్న ఏడు దేశాలకు చెందిన జాతీయ భద్రతా కౌన్సిళ్ల అధిపతులు తమ చర్చల అనంతరం ఉమ్మడిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
ఇరాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, తుర్క్ మినిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ సెక్యూరిటీ అధికారులు ప్రధానమంత్రితో మాట్లాడుతూ ఈ చర్చ నిర్వహించడంలో భారతదేశం చూపిన చొరవను, చర్చల్లో నాణ్యతను ప్రశంసించారు. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితిపై తమ దేశాల వైఖరిని వారు వివరించారు.
కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లను కూడా తట్టుకుని ఢిల్లీ భద్రతా గోష్ఠిలో పాల్గొన్నందుకు వారిని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ప్రాంతీయ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన నాలుగు అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవి - ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద బృందాలు ఉపయోగించుకోవడంపై సంపూర్ణ వ్యతిరేకత; ఆఫ్ఘనిస్తాన్ మీదుగా మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు వ్యతిరేక వ్యూహాల అమలు; ఆఫ్ఘనిస్తాన్ లోని మానవతాపూర్వక సంక్షోభం పెరుగుదలను అరికట్టే చర్యలు.
సెంట్రల్ ఆసియా ప్రాంతానికి చెందిన స్వీయ నియంత్రణ, ప్రగతిశీల సంస్కృతిని పునరుజ్జీవింపచేయడం, తీవ్రవాద ధోరణుల వ్యతిరేకతపై ప్రాంతీయ భద్రతా గోష్ఠి కృషిని మరింతగా కొనసాగిస్తుందన్న ఆశాభావం ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.